నూతన తితిదే ఈఓగా భాద్యతలు స్వీకరించిన అనిల్‌కుమార్‌ సింఘాల్‌

Anilkumar Singal

తల్లిదండ్రులు గురుదైవానుగ్రహం వల్లే శ్రీవారి కొలువు

నూతన తితిదే ఈఓ శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌

ప్రతి భక్తునికి మెరుగైన దర్శనమే ధ్యేయం

ప్రపంచ ప్రఖ్యాత ధార్మిక సంస్థ అయిన తిరుమల తిరుపతి దేవస్థానముల కార్యనిర్వహణాధికారిగా పదవీ బాధ్యతలు స్వీకరించడం తల్లిదండ్రులు, గురువు, భగవంతుని యొక్క ఆశీర్వాదంతోనే సాధ్యమని తితిదే నూతన కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉద్ఘాటించారు.

శనివారం ఉదయం తిరుమలలో శ్రీవేంకటేశ్వరస్వామి ఆలయంలోని రంగనాయకుల మండపంలో తితిదే 25వ కార్యనిర్వహణాధికారిగా బాధ్యతలను తన పూర్వపు కార్యనిర్వహణాధికారి శ్రీ డాక్టర్‌ డి. సాంబశివరావు నుండి స్వీకరించారు. అనంతరం ఆయన శ్రీవారిని దర్శించుకున్నారు. అటు తరువాత వేదపండితులు రంగనాయకుల మండపంలో వేదాశీర్వచనం అందించారు. తిరుమల జెఇఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జేఇఓ శ్రీ పోలా భాస్కర్‌లు తితిదే నూతన ఇఓకు స్వామివారి తీర్థ ప్రసాదాలు, శేషవస్త్రం, శ్రీవారి చిత్రపటాలను అందజేశారు.

అనంతరం ఆలయం వెలుపల ఆయన మీడియాతో మాట్లాడుతూ తిరుమలకు లక్షలాదిగా భక్తులు వస్తుంటారని వారందరికి మెరుగుగా దర్శనం కల్పించడమే ధ్యేయమని ఆయన అన్నారు. ”ఇప్పటికే పూర్వపు ఈఓలందరూ భక్తులకు మెరుగుగా దర్శనం కల్పించడానికి ఎన్నో మార్పులు చేశారన్నారు. అయితే మంచి మార్పులకు అంతమనేది వుండదు. కాబట్టి మా అధికారులందరి సమన్వయంతో మరింత ఉన్నతంగా భక్తులకు సంతృప్తికరమైన దర్శనాన్ని అందించడానికి ఒక సేవకునిగా కృషి చేస్తాను”. అని తెలిపారు.

ఇది ఉద్యోగం కాదు సేవాభాగ్యం, దేవుడు ఆదేశిస్తేనే శ్రీవారి మెట్టు ఎక్కగలం

దేవుడు ఆశించి ఆదేశిస్తేనే శ్రీవారి మెట్టు ఎక్కగలం. దేవుని అతిథులు భక్తులు. భక్తుల సేవకులం మనం. కాబట్టి ప్రతి అధికారి ఉద్యోగి ఇది ఒక ఉద్యోగంలా కాకుండా సేవాభాగ్యంగా భక్తులకు సేవచేయాలని తితిదే నూతన కార్యనిర్వహణాధికారి శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ ఉద్ఘాటించారు.

తితిదే నూతన ఇఓగా బాధ్యతలు చేపట్టిన వెంటనే ఆయన తిరుమలలోని అన్నమయ్య భవనంలో తిరుపతి తిరుమలలోని వివిధ విభాగాధిపతులతో పరిచయ సమావేశంలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన అధికారులను ఉద్ధేశించి మాట్లాడుతూ తితిదేలో ఉద్యోగం అనేది జన్మజన్మాతర కర్మల అనుసారం అనుసరించి భగవంతుడు సంకల్పిస్తే సంప్రాప్తిస్తుందన్నారు. భారత దేశంలోనే కాదు యావత్తు ప్రపంచంలో కూడా తితిదేలో ఉద్యోగానికి సమానం మరొకటి లేదు. కనుక మనమందరం కలిసికట్టుగా పనిచేస్తూ భక్తులకు మరింత ఉన్నతంగా సేవలందించాలని ఆయన పిలుపునిచ్చారు.

ఈ సమావేశంలో తిరుమల జెఇఓ శ్రీ కె.ఎస్‌.శ్రీనివాసరాజు, తిరుపతి జేఇఓ శ్రీ పోలా భాస్కర్‌, ఆల్‌ ప్రాజెక్ట్సు ప్రత్యేకాధికారి శ్రీ ముక్తేశ్వరరావు, సి.ఇ. శ్రీ చంద్రశేఖర్‌రెడ్డి, అదనపు ఆర్థికాధికారి  శ్రీ బాలాజీ ఇతర విభాగాధిపతులు పాల్గొన్నారు.

******

భగవత్‌ రామానుజుల సహస్రాబ్ది విరాళంపై తొలి సంతకం

తితిదే నూతన ఇఓగా శ్రీ అనిల్‌కుమార్‌ సింఘాల్‌ బాధ్యతలు చేపట్టిన వెంటనే భగవత్‌ రామానుజుల సహస్రాబ్ది విరాళంగా తిరుమల శ్రీశ్రీ పెద్దజీయంగార్‌ తయారు చేయిస్తున్న రజత యగ్నోపవీతం తాలుకు ఫైలుపై తొలి సంతకం చేశారు. కాగా ఈ యగ్నోపవీతాన్ని శ్రీవారి ఆలయంలోని భాష్యకార్ల  సన్నిధిలో ఉన్న భగవత్‌ రామానుజల వారి మూలమూర్తికి అలంకరిస్తారు.

1 Comment

  1. ivrmectin.com

    http://ivrmectin.com – ivermectin tablets dosage

Leave a Comment

Your email address will not be published.

+ eighty six = 87