శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

శ్రీవారి ఆలయంలో శాస్త్రోక్తంగా పవిత్ర సమర్పణ

        తిరుమల శ్రీవారి ఆలయ పవిత్రోత్సవాల్లో భాగంగా రెండో రోజు సోమవారం శాస్త్రోక్తంగా ప‌విత్ర సమర్పణ జరిగింది.

       ఈ సందర్భంగా ఉదయం యాగశాలలో హోమాలు తదితర వైదిక కార్యక్రమాలు చేపట్టారు. ఆ తరువాత సంపంగి ప్రాకారంలో వేడుకగా స్నపన తిరుమంజనం నిర్వహించారు. ఇందులో పాలు, పెరుగు, తేనె, చందనం, పసుపు తదితర సుగంధ ద్రవ్యాలతో విశేషంగా అభిషేకం చేశారు. అనంతరం వేద ఘోష, మంగళవాయిద్యాల నడుమ శ్రీవారి మూలవర్లకు, ఉత్సవ మూర్తులకు, జ‌య‌విజ‌యుల‌కు, గ‌రుడాళ్వారుకు, వ‌ర‌ద‌రాజ‌స్వామివారికి, వ‌కుళమాత అమ్మ‌వారికి, ఆనంద నిల‌యం, యాగ‌శాల, విష్వ‌క్సేనులవారికి, యోగ‌న‌ర‌సింహ‌స్వామి వారికి, భాష్య‌కార్ల‌కు, పోటు తాయారుకు, ధ్వజస్తంభం, బ‌లిపీఠం, శ్రీభూవరాహస్వామివారికి, శ్రీ బేడి ఆంజనేయస్వామివారికి పవిత్రమాలలు సమర్పించారు.

          అనంతరం సాయంత్రం 6 నుంచి 7 గంటల వరకు శ్రీదేవి, భూదేవి సమేత శ్రీమలయప్పస్వామివారు ఆల‌య నాలుగు మాడ వీధుల్లో విహ‌రించి భ‌క్తుల‌కు ద‌ర్శ‌న‌మిస్తారు. రాత్రి 8 నుంచి 11 గంటల వరకు యాగశాలలో వైదిక కార్యక్రమాలు జరుగనున్నాయి.

    ఈ కారణంగా ఆలయంలో కల్యాణోత్సవం, ఊంజల్ సేవ, ఆర్జిత బ్రహ్మోత్సవం, సహస్రదీపాలంకరణ సేవలను టీటీడీ రద్దు చేసింది.

        ఈ కార్యక్రమంలో తిరుమల శ్రీశ్రీశ్రీ పెద్దజీయర్ స్వామి, శ్రీశ్రీశ్రీ చిన్నజీయర్ స్వామి, ఈవో శ్రీ ఎవి.ధర్మారెడ్డి దంపతులు, ఆల‌య డెప్యూటీ ఈవో శ్రీ లోకనాథం, పేష్కార్ శ్రీ శ్రీహరి ఇతర అధికారులు పాల్గొన్నారు.


టీటీడీ ప్రజాసంబంధాల అధికారిచే విడుదల చేయబడినది.